మూడవ భాగం
వేదిక: సత్య లోకంబ్రహ్మ, సరస్వతితో ఈరోజు వైకుంఠ సమావేశంలో జరిగిన విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పి తన దేవేరి అభిప్రాయం అడిగాడు.దానికి వాఘ్దేవి "నాకైతే ఈ కోరిక సమంజసంగా అనిపించడంలేదు.వాళ్ల కోరికని ఈడేర్చితే ఆ దంపతులలో ప్రాణాలతో మిగిలిన భాగస్వామి కర్మలు ఎవరు చేస్తారు- ఆ జీవిని కూడా యముడు తీసుకువచ్చేస్తే.అదీ కాకుండా ఎక్కడో లక్షకో, కోటికో ఇలా దంపతులు ఇద్దరు ప్రాణాలు విడవడం జరుగుతుంది వారి ఆయుర్దాయం అయిపోతుంది కాబట్టి-
ఆలాకాక బలవంతాన ఇంకా ఆయువు ఉన్నవాళ్ళని తేలేరు కదా!
అప్పుడు విధాత సరస్వతిని మెచ్చుకోలుగా చూస్తూ "నేనూ ఇదే సందేహం, అభిప్రాయం వ్యక్తం చేసాను దేవి ఈ రోజు సమావేశంలో”అని అన్నాడు.అప్పుడు సరస్వతిదేవి ఈ విధంగా అంది “మీరు ఒక పని చేయవచ్చు,జీవితభాగస్వామిని కోల్పోయిన తర్వాత దశదిన కార్యక్రమం వరకు ఆగండి.అప్పటికీ జీవించి ఉన్న ఆ జీవితభాగస్వామికి ప్రాణాలు విడవాలనే కోరిక ఇంకా బలీయంగా ఉంటే వాళ్లకి ఉన్న మిగిలిన ఆయువు మీరు వాళ్లకి రాబోయే జన్మలో ఇవ్వండి.ఈ మాత్రం సర్దుబాటు మీరు చేసుకుంటే మీకు ఇబ్బందీ ఉండదు,వాళ్ల కోరికా తీరుతుంది” అంది.
బ్రహ్మకు ఇది అద్భుతమైన సలహాగా అనిపించింది;భార్యని మెచ్చుకోలుగా చూసి “దేవీ నీ సలహా అమోఘం” అన్నాడు చాలా తృప్తిగా, సంతోషంగా!
వేదిక: కైలాసంమహాశివుడు ఇంటికి చేరి రాత్రి భోజనం అయిన తర్వాత పార్వతితో ఈరోజు వైకుంఠంలో జరిగిన సంభాషణలు ఏకరువు పెట్టాడు"దేవీ ఈ మానవులు కోరే ఈ కొత్త కోరిక పై నీ అభిప్రాయం ఏమిటి" అని అడిగాడు.
దానికి పార్వతి దేవి "నాధా ఈ కలియుగంలో కూడా ఇలా మానవులు అనుకోవడం కొద్దిగా వింతగా ఉన్నా ముదాహమైన విషయమే.కానీ ఒకటే నా అనుమానం- అదేమిటంటే దంపతులలో తన జీవితభాగస్వామి ప్రాణాలు విడవడం వల్ల కల్గిన బాధలో తాత్కాలిక మైన భావోద్వేగంతో ఈ భావాలు వ్యక్తం చేస్తున్నారా, లేదా మనస్ఫూర్తిగానే పోయినవాళ్ళ మీద ప్రేమతోనే అనుకుంటున్నారా- అది మీరు క్షుణ్ణంగా పరిశీలించమని నా సలహా" అని పార్వతి తన ఖచ్చితమైన అభిప్రాయం చెప్పింది.అది విన్న మహాశివుడు అలాగే,తప్పక చూస్తాను అని చెప్పాడు, నిద్రకి ఉపక్రమించారు ఇరువురూనూ.
వేదిక: వైకుంఠంశ్రీమహావిష్ణువు-లక్ష్మిదేవి భోజనానంతరం పాలకడలిపై శేషుపాన్పు మీద కబుర్లాడుతూ ఉన్నారు- అచ్చట్లు ముచ్చట్లతో.విష్ణుమూర్తి మాటల మధ్యలో ఈరోజు త్రిమూర్తుల మధ్య జరిగిన సంభాషణ,యముడు ఇంద్రుడు వాళ్ల దగ్గరకు ఏతెంచిన వైనం చెప్పాడు మహాలక్ష్మికి!
అందుకు శ్రీమహాలక్ష్మి ఇలా చెప్ప సాగింది...
“ఎవరి పాపకర్మల ప్రకారము, వారి ఋణానుబందాలు ఉన్నంత కాలం వారు భూలోకంలో ఉండాల్సిందే.జీవితభాగస్వామిని కోల్పోయినంత మాత్రాన వాళ్ళూ వాళ్ళ ప్రాణం పొతే బాగుండు అనే అగత్యం ఏముంది.వారి శేషజీవితం వాళ్ల ఆయుష్షు తీరేంత వరకూ భూలోకంలోనే ఉండాలి.వాళ్ల కోరిక ప్రకారము వాళ్ల ప్రాణాలు కూడా తీసుకువస్తే- రుణ శేషం,కర్మ శేషం మళ్ళీ తర్వాత జన్మలో పంచుకోవాల్సి వస్తుంది.అలా కాకుండా వాళ్ల ఆయుపరిమితి తీరేంతవరకు ఉండగలిగితే- ప్రస్తుతం లాగా వాళ్ల కర్మనుంచి విముక్తిపొంది జన్మరాహిత్యం పొందటానికి అవకాశం ఉంటుంది- మరుజన్మ లేకుండా అర్హులైనవారు- లేదంటే ఈ కొద్దిపాటి కర్మకోసం మరోజన్మ ఎత్తాల్సి వస్తుంది”
ఒక క్షణం ఆపి భర్తను చూస్తూ “ఆ, కాకపోతే మీరు ఒక పని చేయవచ్చు-జీవిత భాగస్వామిని కోల్పోయి మిగిలిన భాగస్వామి జీవితం ఒంటరిగా దుర్భరంగా ఉండి వాళ్ళు జీవచ్ఛవమై జీవనం కొనసాగిస్తుంటే- వాళ్లకి మాత్రమే జీవన్ముక్తిని ప్రసాదించండి-మిగిలిన ఆ కర్మని వారి తరువాత జీవితంలో కలిపేయండి. ఈ మానవులకు పూర్వజన్మ ఎలాగూ జ్ఞప్తికిరాదు కాబట్టి ఇబ్బందీ ఉండదు”
“జీవిత భాగస్వామి పోయినప్పుడు కొన్నాళ్లవరకు అక్కడ ఉన్న వాళ్లకి జీవితం నిరాశగా ఉండొచ్చు, వేదన ఉండొచ్చు.క్రమేపి ఆ ఉద్వేగంలోంచి బయటపడతారు సహజంగానే.ఏదో భావోద్వేగానికి లోనయి మానవులు అనుకున్నంత మాత్రాన మీరు సృష్టిధర్మాన్ని ఏ మాత్రం మార్చక్కరలేదు”
“మీ త్రిమూర్తులకు ఇంకా నా మాటల్లో సందేహం ఉంటే జీవితభాగస్వామి పోయిన పది పదిహేను రోజుల్లో మిగిలిన భాగస్వామికి యమభటుల్నిచెప్పమనండి- ఏదో రూపేణా- వాళ్ల ప్రాణాలు కూడా తీసుకెళ్తామని.నా ఊహప్రకారం వాళ్ళు భూలోకాన్ని
వదలటానికి ఇష్ట పడరు-ఆ క్షణిక భావోద్వేగాల్లోంచి అప్పటికే బయటపడి ఉంటారు కాబట్టి;మానవుల ఈ భావన “స్మశాన వైరాగ్యం లాంటిదే”అన్నది. విష్ణుమూర్తి మెప్పుకోలుగా లక్ష్మి వంక చూసాడు,ఆమె విశ్లేషణ, విశదీకరణ బాగున్నట్టుగా అనిపించడంతో. “అయినా ఏమి చేయాలో మీకు తెలియదా,ఏదో మా తృప్తికోసం అందరి అభిప్రాయలు అడుగుతారు గానీ” అంది.విష్ణువు ఒక చిలిపి నవ్వుతోనే సమాధానమిచ్చాడు దేవేరికి- ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు.
నిన్న మీతో అన్నాను కదా- ఇవండీ త్రిమూర్తులువారి భార్యల మధ్య నిన్నరాత్రి జరిగిన సంభాషణలు- మీ చెవిలో వేసా పొల్లుపోకుండా. రేపు చూద్దాం త్రిమూర్తుల నిర్ణయం ఎలా ఉంటుందో...
ఏదైనా ఈ కధకు ముగింపు ఖచ్చితంగా రేపే ఉంటుంది-ఏదైనా కారణాలవల్ల సమావేశం జరగకుండా ఉంటే తప్ప!!! నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళుకదా. నా వరకు వాళ్ళు నాకు చెప్పినది మీకు చెప్పటం వరకే!
అందాక ఓపిక పట్టండి మరి